కేజీ టు పీజీ హాస్టల్ నిండా సమస్యలే
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మల్లేష్
విశ్వంభర ప్రతినిధి/భూపాలపల్లిః భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీ టూ పీజీ రెసిడెన్షియల్ హాస్టల్ నిండా సమస్యలే ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. నాణ్యమైన విద్య అందించడంలో, నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అని మండిపడ్డారు. మెనూ ప్రకారం పిల్లలకి ఆహారాన్ని అందించడం లేదని.. 2000 మంది విద్యార్థులు ఒకే హాస్టల్లో ఉండడంతో తీవ్రమైన మంచినీటి కొరత ఉందన్నారు.
బాత్రూములు పిల్లలకు సరిపడకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి కేటాయించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్ కూడా కేజీ టూ పీజీ లోనే పిల్లలను ఉంచడం వల్ల వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని.. వెంటనే వెంకటాపూర్ మండల కేంద్రానికి హాస్టల్ బిల్డింగ్ కేటాయించి అక్కడే చదువుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
రెండు హాస్టల్స్ కు సంబంధించిన విద్యార్థులు ఒకేచోట ఉండటం వలన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించట్లేదని చెప్పారు.మంత్రి సీతక్క స్పందించి తక్షణమే హాస్టల్ తరలించాలని విజ్ఞప్తి చేసారు.