గిరిజన సమాజంలో విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. - కేతావత్ బబురామ్ నాయక్
విశ్వంభర, హైదరాబాద్ :- గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బబురామ్ నాయక్ మాట్లాడుతూ లంబాడీలు గిరిజనులే, వలసవాదులు కారని చరిత్ర సాక్ష్యంగా స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా వేదికలపై లంబాడీలు వలసవాదులని, గిరిజనుల కాదని ప్రచారం చేస్తూ గిరిజన సమాజంలో విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చరిత్రను వక్రీకరించే, గిరిజనుల మధ్య వైరం పెంచే, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే దుష్ప్రచారం.
చరిత్ర చెబుతోంది – గోర్ బంజారాలు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో యోధులుగా పోరాడిన ధీరులు. మొఘల్ దాడుల అనంతరం అడవుల్లో తండా జీవన విధానం కొనసాగించి, రవాణా, వ్యాపారం ప్రధానాధారంగా జీవించారు. బ్రిటీష్ పాలనలో రైలు మార్గాలు, జాతీయ రహదారులు నిర్మించడంతో బంజారాల జీవనోపాధి పూర్తిగా ధ్వంసమైంది. 1857 స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ సంపద తరలింపును అడ్డుకోవడంలో బంజారాలు కీలక పాత్ర పోషించాయి. దానికి ప్రతీకారంగా బ్రిటీష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871 కింద వారిని నేరస్తులుగా ప్రకటించింది. అయినప్పటికీ అధికారిక రికార్డుల్లో వారిని గిరిజన తెగలుగా గుర్తించింది. హైదరాబాద్ సంస్థానంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో లంబాడీలు/సుగాలీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు. 1976లో పార్లమెంట్ ఆమోదించిన ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లు ద్వారా తెలంగాణ లంబాడీలకు తిరిగి ఎస్టీ హోదా పునరుద్ధరించబడింది. ఇది కొత్త హక్కు కాదు – చారిత్రక న్యాయం సాధన మాత్రమే.
రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది – ఆర్టికల్ 14 ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇస్తుంది. ఆర్టికల్ 46 బలహీన వర్గాలను రక్షించి, అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంచుతుంది. అలాంటి సందర్భంలో లంబాడీలను వలసవాదులుగా చూపించే వ్యాఖ్యలు, ప్రచారాలు రాజ్యాంగ విరుద్ధం. గిరిజన సమాజ ఐక్యతను కాపాడడానికి డిమాండ్లు:
లంబాడీలపై వలసవాదుల ముద్ర వేసే వ్యాఖ్యలపై ప్రభుత్వం అధికారిక ఖండన ప్రకటన చేయాలి.
గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టే సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ ప్రసంగాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
గిరిజన చరిత్ర, తండా సంస్కృతి, గిరిజన హోదాను విద్యా పాఠ్యాంశాలలో చేర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
గిరిజన సంక్షేమ నిధుల వినియోగంపై స్వతంత్ర ఆడిట్ జరిపి నివేదికను ప్రజలకు అందుబాటులో పెట్టాలి.
గిరిజన ఐక్యతను కాపాడే అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించాలి.
“లంబాడీలు గిరిజనులే, వలసవాదులు కారని చరిత్ర చెబుతోంది. దేశంలోని చివరి గిరిజనుడు అభివృద్ధి చెందే వరకు పోరాటం కొనసాగుతుంది.” ఆయన అన్నారు



