విచారణ కాక ముందే తీర్పు ఎలా చెప్తారు.. జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ
రూల్స్‌కి విరుద్ధంగా కమిషన్ విచారణ
చైర్మన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు
విచారణ సరిగా లేనందునే హాజరు కాలేదన్న మాజీసీఎం
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లపై తనపై ఇష్టం వచ్చినట్టు కమిషన్ మాట్లాడిందని ఘాటు లేఖ రాశారు. అసలు బీఆర్ ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ లో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఖ్యాతి తమకే దక్కుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.
విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మిగులు కరెంట్ రాష్ట్రంగా మార్చిన తన మీద కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పదేండ్లు పనిచేసిన తనపై ఇలాంటి అప్రదిష్ట మాటలు మంచిది కాదన్నారు. అసలు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఎలా తీర్పు చెప్పేస్తారని ఆగ్రహం తెలిపారు కేసీఆర్.
థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం కాలుష్యం, నిర్మాణ వ్యయం ఎక్కువ అని, అందుకే తాము సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాలు చేపట్టామని కేసీఆర్ వివరించారు. అసలు ఈ కమిషన్ ను రాజకీయ కక్షతోనే వేశారని.. వెంటనే ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని.. పూర్తి కక్ష సాధింపులా ఉందని మండిపడ్డారు కేసీఆర్.
ఈఆర్సీ తీర్పులపై కమిషన్లు వేయొద్దు
వాస్తవానికి జూన్ 15వ తేదీన తాను కమిషణ్ ముందు హాజరై సమాధానం చెప్పాలని అనుకున్నానని.. కానీ విచారణ రూల్స్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు సాగిందని.. కాబట్టి తాను ఏం చెప్పినా లాభం ఉండదనే ఆగిపోయినట్టు తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. అసలు ఇలాంటి వాటిపై కమిషన్లు వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు.