భవిష్యత్ తరాలకు మనం మంచి చేయాలంటే మొక్కలు నాటాలి
డీఎస్పీ సంపత్ రావు
విశ్వంభర భూపాలపల్లి జూలై 19
భవిష్యత్ తరాలకు మనం మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు అన్నారు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆయన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మొక్కను నాటి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మానవుని మునుగడకు పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు. మన పూర్వీకులు వందేళ్లు ఆరోగ్యంగా బ్రతికారంటే దానికి చెట్లే కారణమన్నారు. మొక్క నుండి చెట్టు వరకు ప్రతి మనిషికి ఎంతో అవసరమన్నారు. పచ్చదనంలోకి వెళితే ఒత్తిడికి దూరమై ప్రశాంతత చేకూరుతుందన్నారు. మొక్క నుండి చెట్టుకు ఎదగాలంటే ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉందన్నారు. అదే చెట్టును నరకాలంటే ఒక క్షణం చాలన్నారు. పచ్చని చెట్లను పెంచితే తప్ప మనిషికి మనుగడ లేదన్నారు. ఒక్కో వ్యక్తి ఒక మొక్క నాటి సంరక్షించాలని, మొక్కలు నాటిన వారు ఇంకో పది మందికి మొక్కలు నాటించే సంకల్పాన్ని కల్పించినట్లయితే వన మహోత్సవం విజయవంతమవుతుందని తెలిపారు.మనం ఆరోగ్యంగా ఉండాలి..సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్, ఎస్ఐ-2 షాఖాన్, తహసిల్దార్ ఎండి ఖాజా మోహీనోద్దీన్, ఎంపీడీవో జయశ్రీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరాం రఘుపతి, యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.