సజ్జనార్ ట్వీట్‌కు హరీశ్ రావు కౌంటర్

సజ్జనార్ ట్వీట్‌కు హరీశ్ రావు కౌంటర్

ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా, సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు 'సిట్' చీఫ్‌గా ఉన్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చిచ్చు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ బృందం విచారించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ తన వ్యక్తిగత 'ఎక్స్' ఖాతాలో.. "అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయింది" అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్టులో కేసీఆర్‌ను కనీసం 'గారు' అని కూడా సంబోధించకపోవడం, ఆయనకున్న 'ప్రతిపక్ష నేత' హోదాను విస్మరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

'మీరెలా డిసైడ్ చేస్తారు?'
సజ్జనార్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను ఆయన తప్పుబట్టారు. కేసు విచారణ దశలో ఉండగానే అది 'అక్రమం' అని సజ్జనార్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కోర్టులు తేల్చకముందే ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని ధ్వజమెత్తారు. దర్యాప్తు అధికారిగా ఉంటూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, మాజీ సీఎం పట్ల కనీస మర్యాద పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. న్యాయ పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసుల ప్రకటనలు ఉండకూడదని హరీశ్ రావు తెలిపారు.

Read More హైదరాబాదులో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం -   తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం నేడే

గతంలో సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు మహిళా భద్రత విషయంలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. కానీ, ఇటీవలి కాలంలో ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధుల అరెస్ట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన కేసులో సిట్ చీఫ్‌గా ఉంటూ.. రాజకీయ సెటైర్లు లేదా పక్షపాత ధోరణి కనిపించేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సీనియర్ అధికారి, రాజకీయ విమర్శల సుడిగుండం నుండి ఎలా బయటపడతారో.. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.

Advertisement

LatestNews