బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి తెలంగాణ మాజీ స్పీకర్
- పోచారం ఇంటికి వెళ్లి కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్‌లోకి ఆహ్వానం
- పోచారం ఇంటి ముందు ఉద్రిక్తత
- ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు
రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయాన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం మెడలో హస్తం కండువా కప్పి సీఎం వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
ముందుగా పుష్పగుచ్ఛం అందజేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎం కోరారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులను చూసి ఆకర్షితుడినై కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, పోచారం ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోచారం ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లో ఉండగానే మాజీ ఎంపీ బాల్క సుమన్, ఇతర నేతలు ఆయన ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024
హైదరాబాద్ - బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/OVUSTkfkot