తెలంగాణ గవర్నర్‌గా మాజీ సీఎం?

తెలంగాణ గవర్నర్‌గా మాజీ సీఎం?

  • నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించే అవకాశాలు
  • కీలక పదవిని కట్టబెట్టే యోచనలో బీజేపీ అధిష్టానం

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోవడంతో బీజేపీ హైకమాండ్ ఆయనకు కీలక పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 

తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిరణ్ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. 2009లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ హై కమాండ్ రోశయ్యను సీఎంగా చేసింది. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించారు. రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 

Read More శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌..

దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్పటి వరకు స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాంటి మంత్రి పదవిని అనుభవం లేకున్నప్పటికీ అనూహ్యంగా ముఖ్యమంత్రిని చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చివరి వరకు పోరాడారు. ఫలితం లేకపోవడంతో సీఎం పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంతంగా జై సమైఖ్యాంద్ర పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.