కాంగ్రెస్‌లో చేరికపై ఎర్రబెల్లి క్లారిటీ
- పార్టీ మారే ప్రసక్తే లేదు
- ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటున్నాం
- కేసీఆర్‌ను సీఎం చేయడమే మా లక్ష్యం
- మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌కు ఎన్నికల్లో కోలుకోని ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పటికీ ఆ పార్టీలోని నేతలు కోలుకోవడం లేదు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్శ్‌కు తెరలేపారు. శుక్రవారం బీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయాన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవగా కొద్ది సేపు ఇరువురూ భేటీ అయ్యారు. అనంతరం పోచారంకు పుష్పగుచ్ఛం అందజేసి మెడలో హస్తం కండువా కప్పి సీఎం వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది.
ఈ వార్తలు వస్తున్న క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్‌ను వీడటం లేదని స్పష్టం చేశారు. ఇతర పార్టీలో చేరే ఆలోచనే తనకు లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటున్నట్లు వెల్లడించారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని చెబుతూ మోసం చేయొద్దని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్నారు.