కేంద్ర జౌళి ,టెక్స్టైల్ శాఖ మంత్రిని కలిసిన డా.బోగ శ్రావణి - చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ఎంపీ అర్వింద్ తో కలిసి కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ ని విన్నవించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి
ప్రింటెడ్ చీరలను అరికట్టి చేనేతను రక్షించండి
న్యూఢిల్లీ , విశ్వంభర :- తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)ని ఏర్పాటు చేయాలనీ కేంద్ర జౌళి ,టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ తో కలిసి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. భోగ శ్రావణి విన్నవించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని తెలంగాణలో స్థాపించాలని , చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో భేటీ అయి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.తెలంగాణ ఇక్కత్ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్లో అసలు ఇక్కత్ చీరలు 8000 రూ. ధర ఉంటుందని కానీ ప్రింటెడ్ ఇక్కత్ చీరలు కేవలం 300 రూపాయలకే లభించడంతో, చేనేత కార్మికుల జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడుతుందని, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి నేతన్నలకు భరోసా కల్పించడానికి ప్రింటెడ్ చీరల ఉత్పత్తి మరియు విక్రయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
చేనేత ఉత్పత్తులపై జిఎస్టి విధించినప్పటి నుండి నేతన్నలు అదనపు ఆర్థిక భారం తో ఇబ్బంది పడుతున్నారని కాబట్టి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ కళకు, గద్వాల్ చీరలకు, వరంగల్ దుర్రీల ను ఉత్పత్తి చేసే అసాధారణ కళ తెలంగాణ నేతన్నల సొంతమని, కాబట్టి తెలంగాణలో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అనంతరం Dr. బోగ శ్రావణి పోచంపల్లి శాలువాతో మంత్రికి సన్మానించగా, ఆయన ఆసక్తిగా గమనిస్తూ, తెలంగాణ వచ్చినప్పుడు తప్పకుండా పోచంపల్లిని సందర్శిస్తానని, అదేవిధంగా విన్నపాల మీద తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతన్నల తరపు నుండి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.