‘ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది..’ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

‘ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది..’ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

  • పాఠశాలకు రూపాయి ఖర్చులేకుండా ప్రయాణం 
  • ఆధార్‌కార్డులు చూపిస్తూ విద్యార్థినుల హర్షం 
  • సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం

తెలంగాణలో విద్యార్థులు వేసవి సెలవులు ముగిసి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ (బుధవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకొచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన రోజే అమలు చేసిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థినులు ఇప్పుడు బస్ పాస్‌లకు బదులుగా ఆధార్‌కార్డులను వెంట తీసుకెళ్లి జీరో టికెట్ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తోంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 

Read More సాయిబాబా మందిరానికి సామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ విరాళం 

రేవంత్ ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల  బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు’’ అంటూ సీఎం పేర్కొన్నారు.