నేరాలు చేస్తే విచారణ తప్పదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

నేరాలు చేస్తే విచారణ తప్పదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు సిట్ నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నేరాలు చేసినప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిందేనని, తాము ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి అధికారులు విచారించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

జాతిపిత హోదాపై తీవ్ర అభ్యంతరం
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనను 'తెలంగాణ జాతిపిత'గా అభివర్ణించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించి, కేవలం కుటుంబ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇచ్చిన వారు జాతిపితలు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అసలైన తెలంగాణ ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసి, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి మేధావులను అవమానించిన చరిత్ర కేసీఆర్ సర్కార్‌దని దుయ్యబట్టారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పంచుకున్నారని, ఆనాడు ఉద్యమకారుల తలుపులు బద్దలు కొట్టి బెడ్ రూమ్‌ల నుంచి ఈడ్చుకెళ్లినప్పుడు ఈ 'జాతిపిత' హోదా ఎటు పోయిందని నిలదీశారు.

Read More పాక హనుమంతు (గణేష్ ఉయికె) 2022 నవంబర్ లో తల్లికి రాసిన ఉత్తరం

విచారణకు సహకరించాల్సిందే..
ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు విచారణ అంటే తప్పించుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడని ఉద్యమకారుడు లేడని, అనేకమందిని అరెస్టులు చేసి వేధించారని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన సాగుతోందని, గతంలో జరిగిన అరాచకాలను తాము ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.