టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ
* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు
* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం
* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు

విశ్వంభర, జూబ్లీహిల్స్  : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన సంఘటన జరిగింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అడుగు పెట్టడం.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి టీడీపీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే బయటకు వెళ్లారని.. కేడర్ బలంగా ఉందని తెలిపారు. చంద్రబాబు ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లి కలిసి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేశాయి.  అయితే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. వీరంతా సైకిల్ ఎక్కేందుకే రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నేతల పేర్లు పార్టీ మారతారనే వారి జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.