యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే....
విశ్వంభర భూపాలపల్లి జూలై6 యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం కాటారం పోలిసు స్టేషన్ ఆవరణలో కాటారం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల పట్ల దూరంగా ఉండాలని, అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఎస్పి హాజరయ్యారు. ఆ తర్వాత గంజాయి సేవించే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకొంటాయన్నారు. విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు దుర్భరం అయ్యాయని, వ్యసనాలకు బానిసలుగా కారాదన్నారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ మంచిపేరు తీసుకురావాలన్నారు. డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అత్యంత భయంకరమైన వ్యసనం అని, దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని ఎస్పి పేర్కొన్నారు. డ్రగ్స్ తో విచక్షణ కోల్పోతారని, ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, యువత ఎక్కువగా మత్తుకు బానిస అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే ప్రజలు, స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణా, గంజాయి సేవించే వారిపై పటిష్ట నిఘా ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి హెచ్చరించారు. అంతకు ముందు నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్)తో కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న 11 ఫోన్లను ఎస్పి బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ నాగార్జున రావు, SI లు అభినవ్, నరేష్, మహేందర్, హరీ శంకర్, చక్రపాణి, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.