మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద మొత్తం ఏడు సెక్షన్లతో కేసులను నమోదు చేశారు.
పేట్ బషీరాబాద్ లో 32 గుంట భూమి విషయంలో వీరిపై కేసు నమోదైంది. ఈ భూమి ఆక్రమణకు గురైందని, నిర్మాణాలు కూడా కూల్చివేశారంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో వారు కాస్తా శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుమేరకు మల్లారెడ్డిపై కేసునమోదుచేశారు.
మేడ్చల్ జిల్లా సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో గల 32 గుంటల భూమిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. తమ విచారణలో ఇది నిజమే అని తేలిందని వారు చెబుతున్నారు. మల్లారెడ్డి పేరు మీద 29 గుంటలు మాత్రమే ఉన్నాయని.. దాంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదే సర్వే 82లోని భూమిపై గతంలో 15 మంది మల్లారెడ్డి కుటుంబంపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ భూ వివాదం ఇంకా నడుస్తుండగానే ఇప్పుడు మరో కేసు నమోదైంది.