విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్
On
రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 15% నిధులు విద్యారంగానికి కేటాయించాలి.
బాలల హక్కుల సంక్షేమ సంఘం (బిహెచ్ఎస్ఎస్) డిమాండ్
విశ్వంభర జూలై 25 : - ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ రూ 2,91,159 కోట్లలో విద్యారంగానికి కేవలం 7.3% మాత్రమే నిధులు కేటాయించడం దారుణమైన విషయం అని బాలల హక్కుల సంక్షేమ సంఘం ( బి హెచ్ ఎస్ ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ అన్నారు.
విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామ మాత్రంగా 7.3% మాత్రమే కేటాయించింది అని వారన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3% అనేది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువగా ఉంది. గత ఓటాన్
బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించగా అది ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ లో రూ 21,292 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ప్రభుత్వ విద్యారంగం ప్రగతికి ఏమాత్రం దోహదం చేయవని వారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినది. కానీ ఈ బడ్జెట్లో దాని ఊసే లేదు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వము విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన విషయం విధితమే. కానీ అదే బాటలో కాంగ్రేసు ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరింది.
ఒకవైపు శాసన సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ రోజునే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలము కుశ్నపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 18 ఏళ్ళ కిందట కట్టిన బడి భవనంలో ఎనిమిదో క్లాసు విద్యార్థులు పగుళ్లు తేలిపోయిన స్లాబు వర్షాలకు ఉరుస్తుండటంతో తడవకుండా ఉండేందుకు గొడుగులు పట్టు కొని పాఠాలు వింటున్న వార్తా చిత్రము ఈ రోజు అన్ని దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది రాష్ట్ర విద్యారంగం దీన స్థితిని తెలియచేస్తుంది.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ శుభ్రం చేసేవాళ్ళు లేరు. పాఠశాలల ఆవరణ,తరగతి గదులు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు లేరు. విద్యార్థులే తమ తమ తరగతి గదులు శుభ్రం చేసుకునే పరిస్థితి దాపురించింది.
చాలా పాఠశాలలలో అటెండర్లు లేరు. రాత్రి కాపాలాదారులు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఉన్నత పాఠశాలలకు ఐదు లక్షల పైగా ఖరీదు చేసే టీవీ లు ఇవ్వడం జరిగింది. కాపాలాదారులు లేక వాటి రక్షణ ప్రశ్నార్థకముగా ఉంది. హైస్కూలు హెడ్మాస్టర్లు ఈ టీవీ ల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రూ 2,91,159 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 7.3% నిధులతో మౌళిక సదుపాయాలు ఎలా కల్పిస్తారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవి.
పాఠశాల విద్యారంగంలో ఖాళీల భర్తీ, మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు, మౌళిక సదుపాయాల కోసం ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవని బాలల హక్కుల సంక్షేమ సంఘం భావిస్తుందని ఇంజమూరి రఘునందన్ అన్నారు.
_ ఇంజమూరి రఘునందన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బాలల హక్కుల సంక్షేమ సంఘం (బి హెచ్ ఎస్ ఎస్)