ఒక కోటి 59 లక్షల విలువైన ఎండు గంజాయి దహనం --- జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే....
విశ్వంభర భూపాలపల్లి జిల్లా : -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపి, గంజాయి నిర్మూలనకు నిరంతర నిఘా పెడుతూ, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి 25 కేసుల్లో ఒక కోటి 59 లక్షల విలువ గల 636 KGల ఎండు గంజాయిని స్వాధినం చేసుకుని, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆద్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం. హన్మకొండ సుబేదారీలోని కాకతీయ మెడిక్లిన్ వద్ద సైంటిఫిక్ పద్ధతిలో దహనం చేసినట్లు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయి, డ్రగ్స్ పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో నూరేళ్ల జీవితం నాశనం అవుతుందని ఎస్పి గారు పేర్కొన్నారు. యువత విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదకద్రవ్యాల వినియోగం, వారి భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. జిల్లాలో అక్రమంగా మాదకద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించిన, విక్రయించిన, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, మరియు జిల్లా పరిధిలోని రిజర్వు ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐలు, పాల్గొన్నారు.