టీ20 ప్రపంచ కప్ నుంచి పాక్ నిష్క్రమణ.. షోయ‌బ్ అక్త‌ర్ అసంతృప్తి

టీ20 ప్రపంచ కప్ నుంచి పాక్ నిష్క్రమణ.. షోయ‌బ్ అక్త‌ర్ అసంతృప్తి

  • వరుణుడి కారణంగా అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
  • చెరో పాయింట్ రావడంతో పాకిస్థాన్‌కు షాక్
  • సూపర్ 8 చేరకుండానే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ 

పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ జట్టు నిష్క్రమించింది. దీంతో పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో చేసిన పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. కేవ‌లం ఒకే ఒక లైన్‌లో అక్త‌ర్ ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ర్నీ ముగిసింది’ అంటూ అక్త‌ర్ కామెంట్ చేశారు. 

ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లో ఒకటి మాత్రమే గెలిచింది. దీంతో పాక్ జట్టు ఈ సారి సూపర్ 8కు కూడా చేరకుండా ఇంటిదారి పట్టనుంది. అయితే, మిగిలిన మ్యాచ్ ఈ నెల 16న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందులో గెలిచినా పాకిస్థాన్‌కు ఒరిగేది ఏం లేదు. దీంతో పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ మొదలయ్యాయి. 

మరోవైపు శుక్రవారం జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అనంతరం ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన అమెరికా జట్టు ఐదు పాయింట్లు సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. ఇప్పటి వరకు  గ్రూప్ ఏ నుంచి ఇండియా, అమెరికా మాత్రమే సూప‌ర్‌8కి ప్ర‌వేశించాయి.

Tags:

Related Posts