తాడిచర్ల-1 గనులు తెలంగాణకే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాడిచర్ల-1 గనులు తెలంగాణకే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గత కొంతకాలంగా రాజకీయంగా పెను దుమారం రేపుతున్న తాడిచర్ల-1 బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత కొంతకాలంగా రాజకీయంగా పెను దుమారం రేపుతున్న తాడిచర్ల-1 బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఈ గనులను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో అధికారికంగా వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను తెలియజేశారు. తాడిచర్ల-1 బొగ్గు బ్లాక్‌ను 2015 ఆగస్టు 31నే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TG GENCO)కు కేటాయించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. 2019లో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక తర్వాత, 2020 జూన్ నుండి గనుల కేటాయింపు విధానం మారిందని ఆయన తెలిపారు. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గనులను కేవలం వేలం ద్వారానే కేటాయించాలని కమిటీ సూచించిందని, అత్యంత అరుదైన పరిస్థితుల్లోనే నేరుగా కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే, తాడిచర్ల-2 గనులను ఇంకా ఎవరికీ కేటాయించలేదని మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడిచర్ల కోల్ బ్లాక్‌ను జెన్కోకు కేటాయించినప్పటికీ, దాని మైనింగ్ బాధ్యతలను సింగరేణికి ఇవ్వకుండా.. ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల పాటు టెండర్ కట్టబెట్టారని విమర్శించారు. సింగరేణి సంస్థతో పనిచేయలేమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయించుకుని మరీ ప్రైవేటుకు అప్పగించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు సుమారు రూ.47,000 కోట్లు బకాయి పడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో మరే కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More  దీదీని సాగనంపే సమయం వచ్చింది: ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే తాడిచెర్ల గనులను ఏఎంఆర్‌ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని, ఇందులో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు గత ప్రభుత్వ హాయంలో వినిపించాయి. ఈ గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని నాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేశారు. ఏఎంఆర్‌ కంపెనీకి తాడిచర్ల బొగ్గుగనుల కేటాయింపులపై విచారణ జరిపించాలని నాడు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు డిమాండ్ చేశారు. తాజా కేంద్రం వివరణతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.