ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ

ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ

  • జీ 7 దేశాల సదస్సుకు హాజరు 
  • విజయవంతంగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు 

 ఇటలీలో జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇటలీ పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. జీ7 సదస్సులో వివిధ దేశాధినేతలతో సమావేశమైన మోడీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనకు ఇటలీలో ఘనమైన ఆతిథ్యం లభించిందని వెల్లడించారు. 

దీన్నిబట్టి మోడీ ఇటలీ పర్యటన విజయవంతమైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోడీ అనేక విషయాలపై చర్చించారు. దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

జీ7 సదస్సులో ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జీ7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని తెలిపారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

Related Posts