ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం
భారత్‌పై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు కలిసి ఘనంగా సత్కరించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌పై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు కలిసి ఘనంగా సత్కరించారు. అమెరికాతో కుదుర్చుకున్న చారిత్రక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుందని ఎంపీలు కొనియాడారు. ఈ విజయంతో పాటు కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ప్రశంసిస్తూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే వేదికపై బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కూడా ఎన్డీఏ నేతలు సాదరంగా సన్మానించారు.
ప్రజల్లోకి బడ్జెట్ ఫలాలు
అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత ఎంపీలదేనని గుర్తు చేశారు.
విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి
పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. విపక్షాలు చేసే నిరాధార ఆరోపణలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. సభలో వాస్తవాలను ధీటుగా వినిపిస్తూ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పాలన మాత్రమే కాదు, ప్రతి పౌరుడికీ అభివృద్ధి ఫలాలను అందించాలని... ఈ ప్రస్థానంలో ఎంపీలు వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.



