మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం

 ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం అటు అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులకు ఊపిరి పోయడంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ట్రంప్ 'ట్రూత్' సోషల్ వేదికగా సంచలన ప్రకటన
ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. "నా స్నేహితుడు మోదీ ఒక శక్తిమంతమైన నాయకుడు. ఆయన విజ్ఞప్తిని గౌరవిస్తూ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

Read More జనవరి 21 నుంచి అంతర్జాతీయ ఎన్నికల సదస్సు

సుంకాల లెక్కలివే
ఇప్పటివరకు భారతీయ ఉత్పత్తులపై అమెరికా దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షాత్మకంగా విధించిన 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. తాజా ఒప్పందంతో మొత్తం సుంకం 18 శాతానికి తగ్గించింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు సున్నా స్థాయికి చేర్చింది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోనుంది.

ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై మోదీ స్పందిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. "రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు మార్గం సుగమమవుతుంది. అమెరికా సుంకాల తగ్గింపు ఎంతో సంతోషకరం. ట్రంప్ నాయకత్వంలో మా భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను" అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

జైశంకర్ పర్యటన వేళ కీలక మలుపు
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటన ప్రారంభమైన రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాలకు భారీ ఊరట కలగనుంది. 'మోదీ-ట్రంప్' ద్వయం ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

LatestNews