‘రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు’.. బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు పొంచి ఉందని గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు పొంచి ఉందని గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌చార్జి అధికారి, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. అలా అనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే నేను సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చాను. అయితే, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు" అని బోస్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన దాడుల బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన అసెంబ్లీలో విపక్ష(బీజేపీ) నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై సువేందు కోల్‌కత్తా హైకోర్టుకు వెళ్లగా.. అనుమతి ఉంటే గవర్నర్‌ను కలిసేందుకు వారిని రాజభవన్ లోపలికి పంపాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారం తర్వాత పోలీసుల తీరుపై గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు. తన ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
అదేవిధంగా తన అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల వారు అలా చేస్తున్నారని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండురోజుల క్రితం రాజభవన్ పోలీసులపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారు తక్షణమే అధికారిక నివాస పరిసరాలను వదిలి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.