ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం
ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానంలోని 'ఇంధన నియంత్రణ స్విచ్'లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానంలోని 'ఇంధన నియంత్రణ స్విచ్'లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దీనిపై పైలట్ ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం తక్షణమే స్పందించి ఆ విమానాన్ని సర్వీసుల నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లారు. సాంకేతిక లోపం తలెత్తిన ఏఐ132 (AI132) సర్వీసు విమానాన్ని ప్రస్తుతం విమాన తయారీ సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీజీసీఏ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఎయిరిండియా వద్ద ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాల ఇంధన స్విచ్‌లను తనిఖీ చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మిగిలిన విమానాల్లో ఎటువంటి లోపాలు లేవని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విమాన తయారీదారుల సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఇంధన సరఫరా నిలిచిపోవడమే ప్రధాన కారణమని 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' తన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. కేవలం సెకను వ్యవధిలో రెండు ఇంజిన్లకు ఇంధనం అందకపోవడం వల్లే ఆ దుర్ఘటన జరిగిందని ఏఏఐబీ తేల్చింది.



