ముగిసిన ఎన్నికలు.. భారీగా పెరిగిన ధరలు

ముగిసిన ఎన్నికలు.. భారీగా పెరిగిన ధరలు

  • పెరిగిన ముడిపదార్థాల వ్యయం
  •  నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలపై ప్రభావం
  • 2 నుంచి 17శాతం వరకు పెంచేసిన ఎఫ్ఎంసీజీ కంపెనీలు

మొన్నటి వరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అమితమైన ప్రేమను చూపించాయి. అటు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడంతో పాటు ప్రజలకు ఆర్థిక భారం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికల హడావుడి అంతా ముగిసింది. ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయ్. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారాన్ని చేపట్టింది. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఇక మార్పు కోరుకుంటున్న ప్రజలకు మరోసారి షాక్ తగిలింది. ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో టమాట సెంచరీ కొట్టింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు పెరగవచ్చని కొందరు అంటున్నారు. 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

తాజాగా, ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో ఆ ప్రభావం వాటితో తయారయ్యే వస్తువులపై పడింది.  నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్నిపెంచేశాయి. దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2 నుంచి 9శాతం పెరిగాయి. అదేవిధంగా జుట్టు సంరక్షణ నూనెలు 8 నుంచి 11శాతం, డోవ్ సబ్బులు 2శాతం, విప్రో ఉత్పత్తులు మూడు శాతం, హెచ్‌యూఎల్ షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4శాతం నెస్లే కాఫీ 8 నుంచి 13శాతం, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ 17శాతం పెరిగాయి. డాబర్ ఇండియా 1 నుంచి 5శాతం, బికాజీ 2 నుంచి 4శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది.