ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
- తల్లి, కుమారుడు, కుమార్తె బలవన్మరణం
విశ్వంభర, ఘట్కేసర్: చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సురేందర్ రెడ్డి అనే వ్యక్తి విదేశాలలో ఉంటుండగా అతని కుటుంబం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ హరితహారం కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటోంది. సురేందర్ రెడ్డి భార్య విజయ, కుమార్తె చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. వేగంగా వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. శనివారం ఉదయం పట్టాలపై ఛిద్రమైన మృతదేహాలను గమనించిన స్థానికులు, రైల్వే గ్యాంగ్‌మెన్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుల వద్ద లభించిన ఆధారాల ద్వారా వారు బోడుప్పల్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులని గుర్తించారు రైల్వే పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశాల్లో ఉన్న సురేందర్ రెడ్డి కి పోలీసులు సమాచారం అందించారు. కుటుంబం ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నప్పటికీ, దీని వెనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా కుటుంబ కలహాలు కారణమా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు . రైల్వే పోలీసులు పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.



