వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్‌కింద పడి ఇద్దరు దుర్మరణం

వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్‌కింద పడి ఇద్దరు దుర్మరణం

  • ఫుట్‌బోర్డుపై నిలబడగా అదుపుతప్పి పడిపోయిన విద్యార్థిని.. 
  • యూసుఫ్ గూడా బస్టాండ్‌ వద్ద ఘటన
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థి మృతి

 

ఆర్టీసీ బస్ కిందపడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. ఆర్టీసీ బస్‌కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధి యూసుఫ్ గూడా బస్టాండ్‌ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడాలోని మాస్టర్స్ కాలేజీలో మెహరీన్ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. 

శుక్రవారం ఉదయం బస్సు నిండా ప్రయాణికులతో నిండిపోగా బస్సు ముందు భాగంలో ఫుట్‌బోర్డుపై నిలబడింది. ఈ క్రమంలో బస్సు దిగడానికి ప్రయత్నించడంతో మూలమలుపు వద్ద విద్యార్థిని అదుపుతప్పి కిందపడిపోయింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగింది. ఫుట్ బోర్డు పైనుంచి జారిపడగా బస్సు చక్రాల కిందపడి మెహరీన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. 

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు

ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మరో ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్‌. మరో యువకుడు అభికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.