గంగానదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతు అయ్యారు. ఈ తీవ్ర విషాదం బీహార్ లో జరిగింది. బీహార్ రాష్ట్రంలోని రాజధాని పాట్నా వరద ప్రాంతంలో ఉమానాథ్ ఘాట్ వద్ద గంగా దసరా రోజు స్నానాలు చేసేందుకు చాలా మంది భక్తులు వెళ్తుంటారు. గంగానదికి ఇరువైపులా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నది ఒడ్డుకు వెళ్లేందుకు ప్రజలు పడవలను ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఓ పడవలో 17 మంది స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. అయితే పడవ కాస్త లోతట్టు ప్రాంతానికి రాగానే బోల్తా పడింది. దాంతో అందులో ఉన్న అందరూ నదిలో పడిపోయారు. ఇందులో 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరకున్నారు. మిగతా ఆరుగురు మాత్రం నదిలో గల్లంతు అయిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పడవ బోల్తా పడగానే.. స్థానికంగా ఉన్న మిగతా బోటు డ్రైవర్లు గల్లంతు అయిన వారిని వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్డీఆర్ ఎఫ్ బృందాన్ని పిలిచారు. ఇక గల్లంతు అయిన వారి కుటుంబీలకు సమాచారం ఇవ్వగా.. వారు బోరున విలపిస్తున్నారు. ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.