బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మెదక్ అల్లర్ల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆయనను ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇప్పటికే తాను మెదక్ వెళ్లనున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ముందుగా పోలీసులు రాజాసింగ్‌ను పోలీసులు మియాపూర్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఓవర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దీంతో బక్రీద్ పండుగ వేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ అల్లర్లలో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామిలు బందోబస్తును పర్యవేక్షించారు. బీజేపీ వర్గాలు ఆదివారం మెదక్ పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజాసింగ్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.