బస్సుపై ముష్కరుల దాడి.. తమ పనేనని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది యాత్రికులు మృతిచెందగా 33మందికి గాయాలయ్యాయి.
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది యాత్రికులు మృతిచెందగా 33మందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది.
గతంలోనూ ఈ ఉగ్రవాదులు రాజౌరీ, పూంఛ్, రియాస్‌లలో ఎత్తైనకొండ ప్రాంతాల్లో చెట్ల పొదలమాటున దాక్కొని ఈ తరహా దాడులు చేశారు. తాజా కాల్పులు ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని, మృతులను ఇంకా గుర్తించలేదని పోలీసులు చెప్పారు. గతేడాది జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మేరకు నిర్ణయం తీసుకున్నది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్‌లైన్ సంస్థ ఏర్పాటైంది. ఇది పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, లష్కరే తోయిబా, తెహ్రీక్ ఈ మిలిటెంట్ ఇస్లామియా, ఘజ్నవి హింద్ సంస్థల కలయికే టీఆర్ఎఫ్ కాగా, ఆ సంస్థకు ఎటువంటి మతపరమైన ఉద్దేశాన్ని కట్టబెట్టవద్దనే ఆలోచనతో టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.