ఏయూ ని పార్టీ ఆఫీస్ గా మార్చారంటూ టీడీపీ విమర్శలు.. వీసీ రాజీనామా..
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఈ మేరకు ఆయన పంపించారు. కాగా ఆయన గత నాలుగేళ్లుగా వీసీగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన వీసీగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగారు.
అయితే ఆయన మీద కొంత కాలంగా టీడీపీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. ఆ పార్టీకి అండగా కార్యకలాపాలు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారంటూ తెలిపింది టీడీపీ పార్టీ. వీసీ ఆఫీస్ కాస్తా వైసీపీ విశాఖ రాజకీయ కార్యాలయంగా మారిందని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.
యూనివర్సిటీలో కూడా పదోన్నతుల విషయంలో ఒక్క సామాజికవ వర్గానికే కేటాయిస్తున్నారని.. కొందరిని టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది టీడీపీ. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.