ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. రాజకీయ ప్రస్థానం ఇదే
- నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం
- తారకరామారావు నుంచి చంద్రబాబు వరకు
- అన్ని పదవుల్లో సేవలందించిన అయ్యన్న పాత్రుడు
- స్పీకర్‌గా తొలిసారి ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగాశుక్రవారం సాయంత్రం 5గంటల వరకు ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే.. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పాలన నుంచి నేటి చంద్రబాబు పాలన వరకు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయ్యన్నపాత్రుడికి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పది సార్లు నర్సీ పట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందగా ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు-భవనాలు శాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. స్పీకర్ పదవి దక్కడంపై అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అన్ని రకాల పదవులు చేశానని స్పీకర్ గా ఛాన్స్ దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రాకూడదని, గౌరవ విపక్ష సభ్యులకు కూడా అసెంబ్లీలో ప్రాధాన్యం ఇస్తానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.