రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్
- శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం
- 100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్
- ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్
రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.
తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.