రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీలో పోలింగ్ రోజు నుంచి మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. కౌంటింగ్ పోలీసులకు సవాల్ గా మారింది. కౌంటింగ్ నేపధ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ రిపోర్టులు కూడా ఉన్నాయి. దీంతో.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.