‘జగన్ ఏపీ ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నాడు..’ టీడీపీ నేతల సెటైర్లు
- జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు
- గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?
- ఈవీఎంలపై మాజీ సీఎం ట్వీట్‌పై టీడీపీ కౌంటర్
ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌కు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఆయన ఏపీ ఎలన్ మస్క్ లా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
పరనింద ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న ఓ ట్వీట్‌లో.. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతావా..?’ అంటూ నిలదీశారు. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదాం.. ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తావో లేదో..? మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, చూద్దాం..! ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి..’ అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం జగన్ తన ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. "న్యాయం జరగడమే కాదు.. అది ప్రజలకు కనిపించాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాదు.. నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనమూ అదే దిశగా పయనించాలి." అని రాసుకొచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు.