ఏపీలో ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు

ఏపీలో ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు

ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్ ప్రయాణం విధానాలపై అధ్యయనం చేశారు. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు.

ఏపీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ఈ కీలక హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేశారు. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు.

ఈ నివేదిక ప్రకారం  తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందనిఅధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉన్నట్లే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తోంది. మరి ఏపీ సర్కార్ కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేక.. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సివుంది. అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ