భద్రాద్రికి భక్తుల తాకిడి
- జనవరిలో రికార్డు స్థాయిలో సందర్శకుల రాక
- దేవస్థాన అధికారుల గణాంకాల వెల్లడి
విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి జనవరి లో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థాన అధికారుల లెక్కల ప్రకారం 2026, జనవరిలో మొత్తం 2,92,369 మంది భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా గత సంవత్సరం జనవరి 2025లో 2,72,335 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 20,034 మంది భక్తులు అధికంగా స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. జనవరి నెలలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కల్యాణోత్సవాలు, శీతాకాల అనుకూల వాతావరణం, పాఠశాలలకు సెలవులు ఉండటం వంటి అంశాలు భక్తుల రాకకు ప్రధాన కారణాలుగా దేవస్థాన వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా వారాంతాలు, అమావాస్య, పౌర్ణమి, ప్రత్యేక ఉత్సవాల రోజుల్లో భద్రాచలం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలానికి తరలివచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రానున్న నెలల్లో కూడా ఇదే స్థాయిలో లేదా మరింతగా భక్తుల రాక ఉండే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.



