రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.
ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.
గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బంది వసతుల కోసం టెండరలను పిలిచారు. ఇక రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటినీ గురువారం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.